హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్వకత్వంలో రూపొందబోయే భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' షూటింగ్ నేడు ప్రారంభం కానుంది. ఈ రోజు కర్నూలు సమీపంలోని కొండ ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరిపిన అనంతరం హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ‘arri alexa XT' కెమెరాలను ఉపయోగించనున్నారు. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు.
దాదాపు వంద కోట్ల భారీ వ్యయంతో ఈచిత్రాన్ని ఆర్కామీడియా తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తియుద్ధం, ధనుర్విద్య, కర్రసాము లాంటి విద్యలను ప్రభాస్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ ఆధ్వర్యంలో సెట్స్ వేస్తున్నారు.
No comments:
Post a Comment